మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం….
ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని బచ్చుగూడెం, ఐనోల్, రామేశ్వరంబండ, పెద్ద కంజర్ల, చిన్న కంజర్లలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మౌలిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే పట్టణాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. చివరి రోజు కావడంతో ప్రచారం ఉత్సాహంగా, హోరెత్తింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

