బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు రీ-ఎంట్రీకి సంకేతాలా..?
గూడెం అధికారంగా ఎప్పుడు కండువా కప్పుకుంటారు?
సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి గూడెం పేరు చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ఆయన రాజకీయ అడుగులు మాత్రం బీఆర్ఎస్ వైపే సాగుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిత్యం బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం, హరీష్ రావు శిష్యుడిగా గుర్తింపు ఉండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది.
ఇటీవల నిర్వహించిన అనుచరుల సమావేశంలో గూడెం మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ నియోజకవర్గానికి గానీ, తనకు గానీ ఎలాంటి లాభం చేకూరలేదని స్పష్టంగా చెప్పారు. అన్ని విషయాలు కోర్టుల ద్వారానే చూసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలు తనను మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. కన్నతల్లిలాంటి బీఆర్ఎస్‌ను మరవలేమంటూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు, అనుచరులకు పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆదివారం పటాన్చెరులో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు. చిట్కుల్ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తలారి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పరిణామాలతో గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి అధికారికంగా ఎప్పుడు కండువా కప్పుకుంటారన్న ప్రశ్న పటాన్చెరు ప్రజల్లో ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఆయన అడుగులు ఏ దిశగా సాగుతున్నాయో వేచి చూడాల్సిందేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

